భారత్ ఘనవిజయం

Asian Legends Cup: క్రికెట్ మైదానంలో దాయాదుల పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన 'ఏషియన్ లెజెండ్స్ కప్ 2026'లోనూ అదే జోష్ కనిపించింది. థాయ్‌లాండ్‌లోని బిసిఎ (BCA) మైదానంలో జరిగిన హై-ప్రొఫైల్ పోరులో ఇండియా లెజెండ్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి, పాకిస్థాన్ లెజెండ్స్‌ను 77 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత మిడిలార్డర్ బ్యాటర్లు పక్కా ప్రణాళికతో ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. దీపక్ శర్మ (33), విజయ్ సింగ్ (31), భాను సేథ్ (30) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు వేగం పెంచడంతో పాక్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ లెజెండ్స్, భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. భారత బౌలర్ కలిమ్ ఖాన్ తన మ్యాజిక్ స్పెల్‌తో పాక్ బ్యాటర్లను వణికించాడు. కేవలం 3.2 ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా పాకిస్థాన్ 19.2 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. కపిల్ రాణా కూడా రెండు వికెట్లతో రాణించి కలిమ్‌కు సహకరించాడు.

తన అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కలిమ్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అతడికి ఇది వరుసగా రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావడం విశేషం.

PolitEnt Media

PolitEnt Media

Next Story