India Create History at Lord’s: లార్డ్స్‌లో భారత్ విశ్వరూపం.. తొలి మహిళల టెస్టులో ఇంగ్లాండ్‌పై 270 పరుగుల భారీ విజయం
ఇంగ్లాండ్‌పై 270 పరుగుల భారీ విజయం
India Create History at Lord’s: లార్డ్స్ క్రికెట్ మైదానం.. క్రికెట్ మక్కాగా పిలిచే ఈ చారిత్రాత్మక వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది! ఇక్కడ జరిగిన మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై 270 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, మువ్వన్నెల జెండాను ఎగరేసింది టీమిండియా.
457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు.. భారత బౌలర్లు కంటిమీద కునుకు లేకుండా చేశారు. నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 130/6తో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను.. స్నేహ రాణా తన స్పిన్ మాయాజాలంతో కుప్పకూల్చింది. స్నేహ రాణా 4 వికెట్లతో మెరవగా.. దీప్తి శర్మ 2 వికెట్లతో మద్దతు ఇచ్చింది. ఫలితంగా ఇంగ్లాండ్ కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మన తెలుగు తేజం, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ క్రాంతి గౌడ్! తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సహా మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నువిరిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో లార్డ్స్ ప్రతిష్టాత్మక 'హానర్స్ బోర్డు'పై క్రాంతి గౌడ్ తన పేరును శాశ్వతంగా లిఖించుకుంది. "చిన్నప్పటి కన కల నిజమైందని, ఈ చారిత్రక మ్యాచ్ స్టంప్‌ను తన ఇంట్లోని చిన్న మ్యూజియంలో భద్రపరుచుకుంటానని" క్రాంతి భావోద్వేగానికి లోనైంది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ విజయంపై స్పందిస్తూ.. లార్డ్స్‌లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమేనని, భవిష్యత్తులో ఇక్కడ కనీసం మరో 10 టెస్టులు ఆడాలని ఉందని తన ఆశను వ్యక్తపరిచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కివర్ సైతం.. భారత్ అన్ని విభాగాల్లో తమకంటే అద్భుతంగా ఆడిందని అంగీకరించింది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక సపోర్ట్ మెసేజ్ పంపగా.. ఐసీసీ చైర్మన్ జై షా ఈ చారిత్రక మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. 1995 తర్వాత ఇంగ్లాండ్ చేతిలో టెస్టుల్లో ఓటమనేదే ఎరుగని టీమిండియా.. మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. కాంగ్రాట్స్ ఉమెన్ ఇన్ బ్లూ!

