భారత్ సరికొత్త రికార్డు

T20 World Cup 2026: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 50 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచి, వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో తమ అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన రికార్డును కూడా తిరగరాసింది. శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో భారత్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని కొత్త చరిత్ర సృష్టించింది.
గతంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన అత్యధిక రన్ ఛేజ్ 174 పరుగులుగా ఉండేది. 2014 ఏప్రిల్ 4న మిర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఈ ఘనత సాధించింది. అప్పుడు 174 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించగా, ఇప్పుడు 196 పరుగుల భారీ స్కోరును అధిగమించి ఆ పాత రికార్డును తుడిచివేసింది. అయితే, అంతర్జాతీయ టీ20ల (T20Is) పరంగా చూస్తే భారత్ అత్యధికంగా 209 పరుగుల లక్ష్యాలను రెండుసార్లు విజయవంతంగా ఛేదించింది. 2023లో ఆస్ట్రేలియాపై విశాఖపట్నంలో ఒకసారి, అలాగే 2026 జనవరిలో రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై మరోసారి భారత్ ఈ భారీ స్కోర్లను దాటేసింది.
ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్ రికార్డులను పరిశీలిస్తే, ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. 2016లో ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఏకంగా 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక సాధారణ టీ20 మ్యాచ్‌ల విషయానికొస్తే, దక్షిణాఫ్రికా పేరిట ఒక అసాధారణ రికార్డు ఉంది. 2023 మార్చి 26న వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా కేవలం 18.5 ఓవర్లలోనే 259 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన చూస్తుంటే, మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి.

