రేపే టైటిల్ ఫైట్

అండర్–19 ఆసియా కప్‌లో ఇండియా కుర్రాళ్లు అదరగొట్టారు. చిన్న ఛేజింగ్‌లో విహాన్ మల్హోత్రా (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 నాటౌట్), హైదరాబాదీ ఆరోన్ జార్జ్ (49 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన లంక ఓవర్లన్నీ ఆడి 138/8 స్కోరు చేసింది. చమిక హీనతిగల (42) టాప్ స్కోరర్. స్టార్టింగ్ నుంచే ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక బ్యాటర్లు బాగా ఇబ్బందిపడ్డారు. ఓపెనర్లు విరాన్ చాముదిత (19), దుల్నిత్ సిగేరా (1)తో పాటు, కవిజా గమాగే (2) నిరాశపర్చడంతో లంక 28 /3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ విమత్ దిన్సారా (32), చామిక ఇండియా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేట్ చేసి నాలుగో వికెట్‌కు 36 బాల్స్‌లో 45 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.
కానీ మధ్యలో విజృంభించిన ఇండియా బౌలర్లు కిత్మా విథనా (7), ఆదం హిల్మీ (1)ని పెవిలియన్‌కు పంపడంతో లంక 84/6తో నిలిచింది. చివర్లో సేథ్మికా సెనెవిరత్నే (30) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సనుజ నిండువార (0 నాటౌట్)కు స్ట్రయిక్ ఇవ్వకుండా చకచకా బౌండ్రీలు బాదాడు. ఏడో వికెట్‌కు 40 బాల్స్‌లోనే 52 రన్స్ జత చేయడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది. హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 18 ఓవర్లలో 139/2 స్కోరు చేసి నెగ్గింది. ఛేజింగ్‌లో ఓపెనర్లు ఆయుష్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (9) విఫలమయ్యారు. రసిత్ నిమ్సారా (2/31) తన తొలి రెండు ఓవర్లలో ఈ ఇద్దర్ని ఔట్ చేయడంతో ఇండియా 25/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో జార్జ్, విహాన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లందర్నీ చితకబాదుతూ మూడో వికెట్‌కు 87 బాల్స్‌లో 114 రన్స్ జత చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. విహాన్, ఆరోన్ ఇద్దరికీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మరో సెమీస్‌లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.

