Hockey World Cup: హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో, హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం నిరాశపరిచింది. అర్జెంటీనాతో జరిగిన కీలక పోరులో భారత్ 3-5 గోల్స్ తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో భారత్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే అర్జెంటీనా దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఆటగాడు జోక్విన్ టోస్కానీ మ్యాచ్ మొదటి నిమిషంలోనే గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత నికోలస్ డెల్లా టోర్రే (6వ నిమిషం), టోమాస్ డొమెనె (33, 45 నిమిషాలు), మళ్లీ జోక్విన్ టోస్కానీ (53 నిమిషాలు) వరుసగా గోల్స్ సాధించి అర్జెంటీనాను తిరుగులేని ఆధిక్యంలో నిలిపారు. తొలి మూడు క్వార్టర్లలో భారత జట్టు కేవలం ఒక్క గోల్ (సుఖ్‌జీత్ - 10వ నిమిషం) మాత్రమే చేయగలిగింది.

ఓటమి ఖాయ అనుకున్న తరుణంలో భారత ఆటగాళ్ళు చివరి క్షణాల్లో పోరాట పటిమ కనబరిచారు. మ్యాచ్ ముగిసేందుకు కేవలం రెండు నిమిషాలు ఉందనగా... 58వ నిమిషంలో సుఖ్‌జీత్, అలాగే సరిగ్గా చివరి నిమిషంలో (60వ నిమిషం) వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ చెరో గోల్ సాధించి ఓటమి అంతరాన్ని తగ్గించారు. అయినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఇటీవల జరిగిన హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు కూడా సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనిస్తూ టోర్నీ నుంచి వెనుదిరగడం భారత హాకీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచ వేదికపై మన ఆటగాళ్ళు మరింత రాణించాలంటే ఇంకా ఏయే విభాగాలలో మెరుగుపడాలనే దానిపై క్రీడా వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story