మనోజ్ తివారీ ఫైర్

Manoj Tiwary Fires Back: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి చవిచూడటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్ ఒంటెద్దు పోకడల వల్లే జట్టు స్వదేశంలోనూ పరాజయాలు ఎదుర్కొంటోందని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ టెస్టులో భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమికి పిచ్‌ కారణం కాదని, బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడమే కారణమని మ్యాచ్ అనంతరం గంభీర్ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రంగా తప్పుబట్టారు.

సరిగా కోచింగ్ ఇవ్వలేదు: తివారీ విమర్శ

స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సరైన కోచింగ్ లోపం వల్లే భారత్ ఓడిందని తివారీ స్పష్టం చేశారు. "ఓడిపోయిన తర్వాత బ్యాటర్ల టెక్నిక్‌ను తప్పుపట్టలేరు. కోచ్‌గా వారికి నేర్పించడం మీ బాధ్యత. బ్యాటర్లు సరిగ్గా డిఫెన్స్ ఆడలేదని అంటున్నారు. మరి మ్యాచ్‌కు ముందు మీరు వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వలేదా? గంభీర్ గొప్ప స్పిన్ ఆటగాడు కాబట్టి అతను మరింత బాగా నేర్పించాలి" అని మనోజ్ తివారీ సూచించారు.

కోహ్లీ, రోహిత్‌పై ఒత్తిడి

అంతేకాకుండా తివారీ భారత జట్టులో జరుగుతున్న ట్రాన్సిషన్ చర్చపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. "భారత క్రికెట్‌లో పరివర్తన దశకు తావు లేదు. న్యూజిలాండ్, జింబాబ్వే వంటి దేశాలకు ఇది అవసరం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌లో కొనసాగాలని భావించినప్పటికీ, ఈ అనవసరమైన ఈ చర్చతో వారిపై ఒత్తిడి తీసుకొచ్చి రిటైర్మెంట్ ప్రకటించేలా చేశారు" అని ఆయన వ్యాఖ్యానించారు. భారత దేశవాళీ క్రికెట్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని తివారీ పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story