ICC T20 Rankings: నంబర్ వన్ టీమ్ ఇండియా: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్

ICC T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మైదానంలో పరుగుల వరద పారిస్తూ, తిరుగులేని ఫామ్‌తో దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. ప్రపంచ క్రికెట్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత్, ఆ జోరును ర్యాంకింగ్స్‌లోనూ కొనసాగిస్తోంది. ప్రస్తుతం 275 పాయింట్లతో భారత్ అగ్రభాగాన నిలవగా.. 262 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో, 258 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. మొదటి ఏడు స్థానాల్లో ఎటువంటి మార్పులు లేకపోవడం విశేషం.
ఈసారి ర్యాంకింగ్స్ పట్టికలో కొన్ని ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, శ్రీలంక 6 పాయింట్లను కోల్పోయి 9వ స్థానానికి పడిపోయింది. ఆప్ఘనిస్తాన్ 220 పాయింట్లతో 10వ స్థానంలో నిలవగా.. పసికూనగా భావించే అమెరికా జట్టు మాత్రం వరుస విజయాలతో సత్తా చాటి, రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐసీసీ ఈ ర్యాంకింగ్స్‌ను గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా రూపొందించింది. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది.. మే 2025 నుంచి జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం వెయిటేజీని, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల వెయిటేజీని కేటాయించారు. దీనివల్ల ప్రస్తుత ఫామ్‌లో ఉన్న జట్లకు మెరుగైన ర్యాంకులు లభించాయి.
అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో కనీసం ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడని ఫిజీ, గాంబియా, గ్రీస్, ఇజ్రాయెల్ జట్లను ర్యాంకింగ్స్ నుంచి తొలగించారు. దీనితో మొత్తం జట్ల సంఖ్య 102 నుంచి 98కి తగ్గింది. మొత్తానికి టీ20 ఫార్మాట్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుతూ నంబర్ వన్ కింగ్‌గా కొనసాగుతోంది.

