International Cricket Council Rankings: ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ ఇండియా జంప్..మూడో స్థానానికి భారత్..
మూడో స్థానానికి భారత్..

International Cricket Council Rankings: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ ఇండియాకు.. గతేడాది నుంచి టెస్టు ఫార్మాట్ ఒక సవాల్‌గా మారింది. స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లోనూ ఊహించని ఓటములు ఎదురుకావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే రాబోయే ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లు భారత్‌కు అత్యంత కీలకం.
ఇలాంటి క్లిష్ట సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన వార్షిక టెస్టు ర్యాంకులు భారత అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకుంది. 104 పాయింట్లతో భారత్ తన సత్తా చాటింది. ఇక ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 131 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 'బజ్‌బాల్' అంటూ టెస్టుల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నామని చెప్పుకునే ఇంగ్లాండ్, భారత్ దెబ్బకు నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం.
మరోవైపు న్యూజిలాండ్ 101 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పసికూనలుగా భావించే ఐర్లాండ్ 25 పాయింట్లు, జింబాబ్వే 10 పాయింట్లతో తమ ఉనికిని చాటుకున్నాయి. అయితే, మొత్తం 12 జట్లలో అఫ్గానిస్థాన్‌కు మాత్రం ఒక్క పాయింట్ కూడా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ర్యాంకుల్లో మెరుగుపడటం మంచి పరిణామమే అయినా.. టీమ్ ఇండియా అసలు లక్ష్యం డబ్ల్యూటీసీ ఫైనల్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లతో జరగబోయే పోరులో గంభీర్-గిల్ సేన ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ప్రతి విజయం భారత్‌ను లార్డ్స్ ఫైనల్‌కు చేరువ చేస్తుంది.

