Five T20 series in South Africa: టీమిండియాకు చావో రేవో.. దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. గెలిస్తేనే సిరీస్ ఆశలు!
గెలిస్తేనే సిరీస్ ఆశలు!

Five T20 series in South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సమరంలో హర్మన్‌ప్రీత్ బృందం ఇప్పుడు అత్యంత క్లిష్ట స్థితిలో నిలిచింది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి.. సిరీస్‌లో వెనుకబడిన భారత్, ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.. లేదంటే సిరీస్ గల్లంతే!
టీమిండియా ప్రధాన ఆందోళన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఫామ్. తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 13, 12 పరుగులకే పరిమితమైన స్మృతి.. కీలకమైన ఈ పోరులోనైనా మెరుపులు మెరిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఫామ్ కూడా జట్టును కలవరపెడుతోంది. బ్యాటింగ్‌లో 9వ స్థానంలో దిగుతూ పరుగులు చేయలేకపోవడమే కాకుండా.. గత రెండు మ్యాచ్‌ల్లో బంతితో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. భారత్ పుంజుకోవాలంటే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ సత్తా చాటడం అత్యంత కీలకం.
మరోవైపు లారా వోల్వార్ట్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. సఫారీ బౌలర్లు భారత బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కళ్లెం వేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించిన దక్షిణాఫ్రికా, ఈ మూడో మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా మళ్ళీ పుంజుకుంటుందా? దక్షిణాఫ్రికా జైత్రయాత్రకు బ్రేక్ వేసి సిరీస్‌ను మలుపు తిప్పుతుందా? బుధవారం జరిగే ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.

