India Squad: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య కివీస్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 16 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తెలుగు తేజం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. ఈ జట్టు ఎంపికలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ విరామం తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమే.

నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ..

టీమిండియా తరఫున భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్, ఫిట్‌నెస్ కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడం, ఈ ఏడాది ఐపీఎల్‌లో కీలక పాత్ర పోషించడంతో సెలక్టర్లు మరోసారి ఆయన అనుభవంపై నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్ వంటి స్వింగ్, బౌన్స్ ఉండే పిచ్‌లపై భువీ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి అతడికి పిలుపునిచ్చారు.

యువ సంచలనాలకు పెద్ద పీట

సెలక్టర్లు యువ ఆటగాళ్లకు, మెరుపు ఫామ్‌లో ఉన్న విధ్వంసకర బ్యాటర్లకు పెద్దపీట వేశారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు పేసర్ ప్రిన్స్ యాదవ్‌లకు జట్టులో అవకాశం కల్పించి సర్‌ప్రైజ్ చేశారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ చోటు దక్కింది. వీరితో పాటు అభిషేక్ శర్మ, నమన్ ధీర్ వంటి దూకుడుగా ఆడే ప్లేయర్లు టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేయనున్నారు.

ఆల్‌రౌండర్లు & బౌలింగ్ విభాగం

జట్టు సమతుల్యత కోసం ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డిలను ఎంపిక చేశారు. స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చూసుకోనున్నారు. ఇక కివీస్ పిచ్‌లపై పేస్ దళాన్ని నడిపించేందుకు భువనేశ్వర్ కుమార్‌తో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు బరిలోకి దిగనున్నారు.

భారత పూర్తి టీ20 జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

భారత్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

మొదటి టీ20: అక్టోబర్ 22, 2026 - హాగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్

రెండో టీ20: అక్టోబర్ 24, 2026 - హాగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్

మూడో టీ20: అక్టోబర్ 27, 2026 - స్కై స్టేడియం, వెల్లింగ్టన్

నాలుగో టీ20: అక్టోబర్ 30, 2026 - ఈడెన్ పార్క్, ఆక్లాండ్

ఐదో టీ20: నవంబర్ 1, 2026- సెడన్ పార్క్, హామిల్టన్

Next Story