India vs England 1st T20 Today: ఇవాళ భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20 ఫైట్.. రివర్‌సైడ్ గ్రౌండ్లో రసవత్తర పోరు.. గెలిచేది ఎవరు?
గెలిచేది ఎవరు?

India vs England 1st T20 Today: ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య హై-వోల్టేజ్ క్రికెట్ పోరుకు సమయం ఆసన్నమైంది! బుధవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ–20 సిరీస్ షురూ కాబోతోంది. ఇంగ్లాండ్‌లోని చెస్టర్-లె-స్ట్రీట్, రివర్‌సైడ్ మైదానంలో నేడు తొలి సమరం జరగనుంది.
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ–20 సిరీస్‌లో రెండూ సున్నా తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఈ సిరీస్ ద్వారా ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీలో, తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీలో యువ భారత్ సత్తా చాటాలని కసితో ఉంది.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు ఇది ప్రతీకార సిరీస్! ఈ ఏడాది మార్చి 5న ముంబై వాంఖడే వేదికగా జరిగిన ‘ఐసీసీ మెన్స్ టీ–20 వరల్డ్ కప్ 2026’ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ కేవలం ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ ఘోర పరాజయం తర్వాత ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి టీ–20 సిరీస్ ఇదే! అందుకే సొంతగడ్డపై ఆ వరల్డ్ కప్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని హ్యారీ బ్రూక్ సేన పట్టుదలగా ఉంది.
భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి స్టార్స్ ఉండగా.. ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్, ఆదిల్ రషీద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.

