India vs South Africa: భారత్ vs దక్షిణాఫ్రికా.. నేటి నుంచి 2వ టెస్టు
నేటి నుంచి 2వ టెస్టు

India vs South Africa: కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలైన టీమిండియా, దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో నేటి నుంచి గువాహటిలోని ఏసీఏ స్టేడియంలో ప్రారంభమయ్యే రెండో, నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి టెస్టులో మెడకు గాయం అయిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ, అతన్ని ఆడించడం రిస్క్ తీసుకోవడానికి జట్టు యాజమాన్యం సుముఖంగా లేదు. గిల్ అందుబాటులో లేకపోవడంతో వైస్-కెప్టెన్ , వికెట్ కీపర్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ టీమిండియాను నడిపించనున్నాడు. గిల్ స్థానంలో యువ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ సాయి సుదర్శన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈశాన్య భారతదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా ఉండటం వల్ల, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా మ్యాచ్ సమయాలను మార్చారు. మ్యాచ్ ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. అంతేకాక, సాంప్రదాయ విరామ సమయాలను మార్చి, మొదట టీ బ్రేక్, ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు. ఈ మ్యాచ్‌తో గువాహటిలోని ఏసీఏ స్టేడియం తొలిసారిగా టెస్టు క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ రెడ్-సాయిల్ పిచ్ స్పిన్నర్లతో పాటు పేస్ బౌలర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది. మొదటి టెస్టులో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమై, 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.

