భారత్‌కు రజతం

Asia Equestrian Championship: ఆసియా ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత డ్రెస్సేజ్‌ టీమ్‌ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది ఖండాల స్థాయిలో భారత గుర్రపు స్వారీ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. గౌరవ్ పుండీర్ (ఉత్తరప్రదేశ్‌), దివ్యకృతి సింగ్ (రాజస్థాన్‌), శృతి వోరా (మహారాష్ట్ర) లతో కూడిన భారత బృందం ఈ టీమ్‌ డ్రెస్సేజ్‌ విభాగంలో 204.059 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన థాయ్‌లాండ్‌ (205.853%) కేవలం 0.2 శాతం పాయింట్ల స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. హాంకాంగ్‌ (203.235%) కాంస్యం సాధించింది.

శృతి వోరా అత్యుత్తమ ప్రదర్శన

భారత విజయంలో అనుభవజ్ఞురాలైన రైడర్ శృతి వోరా కీలక పాత్ర పోషించారు. ఆమె తన గుర్రం మాగ్నానిమస్ తో కలిసి 70.882% వ్యక్తిగత స్కోరు సాధించి, టీమ్‌ ప్రదర్శనను పటిష్టం చేశారు. వ్యక్తిగత ప్రిక్స్ సెయింట్ జార్జెస్ స్టాండింగ్స్‌లో శృతి రెండో స్థానంలో నిలిచారు. "ఈ గుర్రం నా జీవితంలో ఉండటం నాకు చాలా గౌరవం. ఎంతో ఆత్మవిశ్వాసంతో నన్ను మైదానంలోకి తీసుకెళ్తుంది" అని శృతి వోరా తమ ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశారు.

దివ్యకృతి సింగ్ ప్రత్యేక ఘనత

ఈ టీమ్‌లో మరో రైడర్ దివ్యకృతి సింగ్ తన గుర్రం ఇంప్రూవర్ తో కలిసి 67.118శాతం స్కోరు సాధించారు. ఈ రజత పతకంతో, ఆమె ఆసియా క్రీడలు (2022లో స్వర్ణం), ఆసియా ఛాంపియన్‌షిప్‌లు రెండింటిలోనూ పతకాలు సాధించిన ఏకైక భారతీయ ఈక్వెస్ట్రియన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారు.

అర్జున అవార్డు గ్రహీత అయిన దివ్యకృతి, తమ ప్రదర్శనపై మాట్లాడుతూ.. "నా గుర్రం ఇంప్రూవర్ ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అది తన వంతు కృషి చేసింది. మేము కలిసి భారతదేశానికి రజతం సాధించడానికి మా కెరీర్‌లో అత్యుత్తమ స్కోరును అందించాము. స్వల్ప తేడాతో స్వర్ణం మిస్ అయినందుకు బాధగా ఉంది" అని తెలిపారు.

ఈ విజయంతో భారతీయ ఈక్వెస్ట్రియన్ క్రీడా ప్రమాణాలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క విశ్వసనీయత పెరుగుతోందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి లక్ష్యాలుగా వచ్చే ఏడాది జపాన్‌లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు, 2028 ఒలింపిక్ క్రీడలపై భారత రైడర్‌లు దృష్టి సారించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story