Sunil Gavaskar: పెద్ద మైదానాల్లో మన బ్యాటర్ల తడబాటు: సునీల్ గవాస్కర్ కీలక సూచన
సునీల్ గవాస్కర్ కీలక సూచన

Sunil Gavaskar: స్వదేశంలో పరుగుల వరద పారించే భారత బ్యాటర్లు.. విదేశీ గడ్డపైకి వెళ్లేసరికి ఎందుకు తడబడుతున్నారు? ముఖ్యంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ వంటి పర్యటనల్లో మన స్టార్ బ్యాటర్లు బౌండరీ లైన్ వద్దే క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ చేరుతున్నారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి ఒక అత్యంత కీలకమై సలహా ఇఛ్చారు.
ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఫ్లాట్ పిచ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న బౌండరీలు బ్యాటర్లకు ఎంతో అనుకూలిస్తున్నాయి. అక్కడ సరిగ్గా కనెక్ట్ కాని షాట్లు కూడా అవలీలగా బౌండరీ దాటుతుంటాయి. కానీ, అదే మైండ్ సెట్‌తో పెద్ద బౌండరీలు ఉండే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లినప్పుడు మన బ్యాటర్లు భారీ షాట్లు ఆడి బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లకు చిక్కుతున్నారు. చిన్న బౌండరీలకు అలవాటు పడటమే ఇందుకు ప్రధాన కారణమని గవాస్కర్ విశ్లేషించారు.
వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, మన బ్యాటర్లు పెద్ద మైదానాలకు అలవాటు పడటం అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. కొత్త దేశీయ సీజన్ ప్రారంభమయ్యే లోపు మన దేశంలోని ప్రతి మైదానంలోనూ బౌండరీ లైన్లను వెనక్కి జరపాలని కోరారు. దాదాపు ప్రతి స్టేడియంలోనూ ఎల్ఈడీ అడ్వర్టైజింగ్ బోర్డుల వెనుక నడవడానికి తగినంత ఖాళీ స్థలం ఉంటుందని, ఆ స్థలాన్ని వినియోగించుకుని బౌండరీల పరిమాణాన్ని పెంచాలని గవాస్కర్ బీసీసీఐకి సూచించారు.
కేవలం బ్యాటర్లకే కాకుండా, బౌండరీల పరిమాణం పెంచడం వల్ల మన దేశీయ స్పిన్నర్లకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. పెద్ద బౌండరీలు ఉంటే స్పిన్నర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి, వికెట్లు తీయడానికి అవకాశం లభిస్తుందన్నారు. మరి క్రికెట్ దిగ్గజం చేసిన ఈ సూచనపై బీసీసీఐ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి!

