Indian Premier League 2026: దేశంలో ఐపీఎల్ క్రేజ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా, లోపల ఫోర్లు, సిక్సర్ల వర్షం.. ఈ మజాను నేరుగా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఈసారి ఐపీఎల్ చూడాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే! అవును.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటే, ఇదే అదనుగా థర్డ్ పార్టీ సైట్లు భారీ దోపిడీకి తెరలేపాయి. అసలు టికెట్ల ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు!

ప్రముఖ పత్రిక 'మిడ్ డే' (Mid Day) కథనం ప్రకారం.. ఈ నెల 29న ముంబై ఇండియన్స్, కేకేఆర్ (MI-KKR) మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల ధరలు థర్డ్ పార్టీ సైట్లలో కనిష్టంగా 6,500 నుండి గరిష్టంగా 50 వేల రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే! ఏప్రిల్ 12న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ (MI-RCB) మధ్య జరిగే మ్యాచ్‌కైతే క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ మ్యాచ్ టికెట్ల ధర ఏకంగా 15 వేల నుండి లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా దొరికే టికెట్ ధరల కంటే ఇవి ఐదు నుండి పది రెట్లు ఎక్కువ. అయినా సరే, తమ ఫేవరెట్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడటం కోసం ఫ్యాన్స్ ఈ భారీ ధరలు చెల్లించడానికి కూడా వెనకాడటం లేదు. రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగి, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఐపీఎల్ టికెట్లు ఇప్పుడు బంగారం ధరను మించిపోతున్నాయి. ఇక ఈ నెల 28న సన్ రైజర్స్ హైదరాబాద్ , ఆర్సీబీ (SRH vs RCB) మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సందడి మొదలవ్వబోతోంది. హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా తమ టీమ్ ఆటకు ఫిదా అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Next Story