Indian Premier League 2026: ఐపీఎల్ 2026: ఒకే ఇన్నింగ్స్ తో రోహిత్ మూడు రికార్డులు
రోహిత్ మూడు రికార్డులు

Indian Premier League 2026: నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 'హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఒక ఆట కాదు.. అదొక సునామీ. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రోహిత్ శర్మ సరి కొత్త రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కేకేఆర్ పై 36 మ్యాచ్‌ల్లో 1094 పరుగులు, 6 అర్ద సెంచరీలు, ఓ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతటి వాడైనా.. రోహిత్ తనదైన క్లాస్ అండ్ మాస్ షాట్లతో మైదానాన్ని ఊచకోత కోశాడు. ఒకే టీమ్‌పై వెయ్యికి పైగా పరుగులు సాధించి, ఆ జట్టుకు తానొక సింహస్వప్నమని చాటిచెప్పాడు.
ఇక నిన్నటి మ్యాచ్ లో మరో రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి.. ఐపీఎల్ కెరీర్ లో 50వ హాఫ్ సెంచరీ మార్కును చేరుకుని తన నిలకడను నిరూపించుకున్నాడు. ఇక రెండోది.. అభిమానుల ఊపిరి ఆగిపోయేలా చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! కేవలం 23 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి, తన కెరీర్ లోనే అత్యంత వేగవంతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఆ పుల్ షాట్లు, ఆ లాఫ్టెడ్ డ్రైవ్స్ చూస్తుంటే హిట్‌మ్యాన్ మళ్ళీ తన వింటేజ్ ఫామ్ లోకి వచ్చాడని స్పష్టమైంది.
వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని, తన బ్యాట్ లో పవర్ ఇంకా తగ్గలేదని రోహిత్ నిరూపించాడు. వాంఖడే స్టేడియం మొత్తం నీలి రంగులోకి మారిపోయి రోహిత్ నామస్మరణతో మారుమోగిపోయింది. 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించడమే కాదు, రోహిత్ సృష్టించిన ఈ మూడు భారీ రికార్డులు ఈ సీజన్ కే హైలైట్ గా నిలిచాయి.

