Indian Premier League: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ షురూ..తొలిపోరులో RCB vs SRH
తొలిపోరులో RCB vs SRH

Indian Premier League: క్రికెట్ ప్రేమికులకు ఇక పండగే! వేసవి తాపాన్ని మించిపోయేలా.. సిక్సర్ల వర్షం కురిపించేందుకు ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ 19వ సీజన్ నేటి నుంచే గ్రాండ్‌గా షురూ కాబోతోంది. కోట్ల మంది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. తొలి రోజే అసలైన ‘దక్షిణాది సమరానికి’ తెరలేచింది. ఒకవైపు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సైన్యం 'ఆర్సీబీ'.. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ 'సన్ రైజర్స్ హైదరాబాద్' ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొలి పోరుతో ప్రారంభం కానుంది.
ఈ సారి కూడా కప్పు మనదే’ అన్న కసితో బరిలోకి దిగుతోంది బెంగళూరు. చిన్నాస్వామి స్టేడియంలో కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తే పరుగుల వరద పారడం ఖాయం. కానీ, వారిని అడ్డుకోవడానికి సన్ రైజర్స్ పక్కా ప్లాన్‌తో సిద్ధమైంది. అటాకింగ్ గేమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎస్.ఆర్.హెచ్, పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టడంలో దిట్ట. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఆరెంజ్ ఆర్మీ మళ్ళీ గర్జించాలని చూస్తోంది.
ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్! ఆర్సీబీ బ్యాటర్ల పవర్ హిట్టింగ్.. సన్ రైజర్స్ బౌలర్ల వ్యూహాల మధ్య యుద్ధం జరగనుంది. గ్లెన్ మాక్స్‌వెల్ రివర్స్ స్వీప్‌లు.. హైదరాబాద్ బౌలర్ల యార్కర్లు.. వెరసి ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించడం గ్యారెంటీ.మరి ఈ 19వ సీజన్ తొలి సమరంలో పైచేయి ఎవరిది? బెంగళూరు బోణీ కొడుతుందా? లేక హైదరాబాద్ నవాబులు జయకేతనం ఎగురవేస్తారా? చూడాలి.

