Indian Premier League : మే 24 వరకు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు
ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు

Indian Premier League : క్రికెట్ ప్రేమికులకు పండుగలాంటి వార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కు సంబంధించి ఉత్కంఠకు తెరదించుతూ.. బీసీసీఐ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశంలో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు కేవలం మొదటి విడత షెడ్యూల్‌నే ప్రకటించిన బోర్డు, ఇప్పుడు మే 24 వరకు జరగనున్న మిగిలిన లీగ్ మ్యాచ్‌ల వివరాలను అధికారికంగా వెల్లడించింది.
ఈ 19వ సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లు ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోరుతో ఈ రెండో విడత యాక్షన్ మొదలవుతుంది. మొత్తం 12 వేదికల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో విశేషం ఏంటంటే.. ధర్మశాల, గౌహతి , రాయ్‌పూర్ వంటి స్టేడియాలు కూడా ఐపీఎల్ వేదికలుగా క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి.
లీగ్ దశలోని చివరి మ్యాచ్ మే 24న జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్‌లో మొత్తం 50 మ్యాచ్‌లు నిర్వహించనుండగా.. అందులో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉండటం విశేషం. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. మే 31న బెంగళూరు వేదికగా ఫైనల్ జరగనుండగా, ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.
ప్రతి జట్టు తమ హోమ్ గ్రౌండ్‌లో తలపడేలా షెడ్యూల్‌ను పక్కాగా రూపొందించింది బీసీసీఐ. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది గొప్ప అవకాశం, ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో పలు కీలక మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ కూడా తమ సొంత గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.మొత్తానికి మే నెల చివరి వరకు క్రికెట్ అభిమానులకు సిక్సర్ల వర్షం, వికెట్ల వేటతో అసలైన మజా లభించనుంది.

