IPL 2026: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో వెనకబడి ఆందోళనలో ఉన్న ఆ జట్టుకు, ఇప్పుడు తన స్టార్ ప్లేయర్ సేవలను కోల్పోవాల్సి రావడం పెద్ద షాక్ అనే చెప్పాలి. గాయం కారణంగా ముంబై స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
అసలు శాంట్నర్‌కు ఏమైంది? గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఒక అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం శాంట్నర్ కొంపముంచింది. బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టే క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స అనంతరం పరీక్షించిన వైద్యులు, అతను కోలుకోవడానికి సమయం పడుతుందని తేల్చేశారు. దీంతో ఐపీఎల్ 2026 నుంచి అతను వైదొలుగుతున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది.
శాంటర్న్ వంటి కీలక ఆటగాడు దూరం కావడంతో ముంబై మేనేజ్‌మెంట్ తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో, ముఖ్యంగా దక్షిణాఫ్రికా తరపున నిలకడైన ప్రదర్శన చేస్తున్న మహరాజ్.. ఇప్పుడు ముంబై స్పిన్ విభాగానికి వెన్నెముకగా మారనున్నాడు. అతని రాకతోనైనా ముంబై రాత మారుతుందో లేదో చూడాలి.
ఒకవైపు వరుస పరాజయాలు, మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలు.. ముంబై ఇండియన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి కొత్తగా జట్టులోకి వచ్చిన కేశవ్ మహరాజ్, ముంబైను మళ్లీ విజయాల బాట పట్టిస్తాడా? రోహిత్ సేన ఈ గడ్డు కాలాన్ని ఎలా అధిగమిస్తుంది? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా శాంట్నర్ దూరం కావడం ముంబై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

