IPL 2026: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.. అలాంటి డూ-ఆర్-డై పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది! ఆదివారం జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో దుమ్మురేపింది ఢిల్లీ.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 12 పరుగులకే అవుటైనా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 46 రన్స్, ధ్రువ్ జురెల్ 53 రన్స్‌తో చెలరేగి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. ముఖ్యంగా రియాన్ పరాగ్ కేవలం 23 బంతుల్లోనే 51 పరుగులతో హాఫ్ సెంచరీ బాది ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అయితే, ఒక దశలో 200 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించిన రాయల్స్ ఇన్నింగ్స్‌కు.. స్టార్క్ బ్రేకులు వేశాడు. 15వ ఓవర్లో చెలరేగిన స్టార్క్.. ఐదు బంతుల వ్యవధిలో పరాగ్, డొనోవాన్ ఫెరీరా, రవి సింగ్‌లను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మొత్తంగా 4 వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను 193 పరుగులకే పరిమితం చేశాడు. మాధవ్ తివారీ కూడా 2 వికెట్లతో రాణించాడు.

ఇక 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేఎల్ రాహుల్ 56 రన్స్, అభిషేక్ పోరెల్ 51 రన్స్‌తో హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.మిడిల్ ఓవర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసి ఢిల్లీని కాస్త ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ.. చివర్లో అక్షర్ పటేల్ 34 పరుగులు, అశుతోష్ శర్మ 18 పరుగులతో అజేయంగా నిలిచి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన మిచెల్ స్టార్క్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story