ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్

IPL 2026: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది! పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది!
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్ జాకబ్ బెతెల్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలినా.. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లను ఉతికేసారు. వెంకటేశ్ అయ్యర్ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేయగా.. కింగ్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58 రన్స్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో దేవ్‌దత్ పడిక్కల్ 45 పరుగులు, టిమ్ డేవిడ్ కేవలం 12 బంతుల్లో 28 పరుగులతో మెరుపులు మెరిపించడంతో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్‌కు రెండు, అర్ష్‌దీప్, చాహల్‌లకు తలో వికెట్ దక్కాయి.
ఇక 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పోరాడినా ఫలితం లేకపోయింది. శశాంక్ సింగ్ 56 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మార్కస్ స్టాయినిస్ 37, కనోలి 37, సూర్యాంశ్ 35 పరుగులు చేసి ఆశలు రేపారు. కానీ, ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సలామ్ దార్ 3 వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రొమారియో షెఫర్డ్‌లకు తలో వికెట్ దక్కింది.
ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఆరో పరాజయం ఎదురైంది. దీనితో వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 13 పాయింట్లతో ఉన్న పంజాబ్.. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా ముందంజ వేస్తుందా లేదా అనేది మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

