IPL 2026: ఐపీఎల్-19 రెండో స్టేజ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జోరు మామూలుగా లేదు. మైదానం ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. గెలుపు మాత్రం మాదే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ఇది వారికి వరుసగా నాలుగో విజయం!

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే, ఓపెనర్ పాథుమ్ నిశాంక మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో అశుతోష్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేయగలిగింది.

143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఫిన్ అలెన్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇది చిన్న ఛేజింగ్ కదా అని ఏమాత్రం తగ్గలేదు. అలెన్ బ్యాట్ ఝులిపిస్తుంటే స్టేడియం సిక్సర్ల వర్షంలో తడిసిపోయింది. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 10 భారీ సిక్సర్లతో అజేయమైన సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మైదానం నలుమూలలా బౌండరీల మోత మోగించాడు.

అలెన్‌కు తోడుగా కామెరూన్ గ్రీన్ 27 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 14.2 ఓవర్లలోనే 147 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన ఫిన్ అలెన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story