బరిలోకి స్టార్ బౌలర్ స్టార్క్..!

IPL 2026: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగబోతున్నాడు. గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న స్టార్క్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ కీలక అప్‌డేట్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.
గత జనవరి నుంచి మోచేతి,భుజం గాయాల కారణంగా స్టార్క్ ఆటకు దూరంగా ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన తర్వాత, బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అయితే, సుదీర్ఘ విశ్రాంతి తర్వాత ఇప్పుడు స్టార్క్ పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే కఠినమైన నెట్ ప్రాక్టీస్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటున్నాడు.
మే 1వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. గతేడాది 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి తన సత్తా చాటిన స్టార్క్, ఇప్పుడు జట్టులోకి రావడం ఢిల్లీకి పెద్ద బలం. రాజస్థాన్ లాంటి పటిష్టమైన టీమ్‌ను ఎదుర్కోవాలంటే స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్ అని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతానికి స్టార్క్ పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, పరిస్థితులు అనుకూలిస్తే రాజస్థాన్‌తో పోరులో అతను మొదటి ఓవర్ నుంచే బ్యాటర్లను భయపెట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ కీలక మ్యాచ్‌లో స్టార్క్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుతుందా? పాయింట్ల పట్టికలో పుంజుకుంటుందా? అనేది వేచి చూడాలి.

