IPL 2026: లక్నోకు గుడ్ న్యూస్.. గాయం వీడి బరిలోకి దిగుతున్న మయంక్ యాదవ్!
గాయం వీడి బరిలోకి దిగుతున్న మయంక్ యాదవ్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు భారీ ఊరట లభించింది. ఆ జట్టు స్పీడ్ గన్ మయంక్ యాదవ్ ఎట్టకేలకు మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గత రెండు నెలలుగా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న మయంక్, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు లక్నో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ధృవీకరించారు.
నేడు (ఏప్రిల్ 15) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరగనున్న కీలక మ్యాచ్‌లో మయంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు మయంక్ మైదానంలో స్పాట్ బౌలింగ్ చేస్తూ కనిపించాడని, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో సుదీర్ఘంగా చర్చించాడని సమాచారం. మయంక్ రాకతో లక్నో బౌలింగ్ విభాగానికి కొత్త బలం చేకూరనుంది.
"మయంక్ ఇప్పుడు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. టోర్నీ ఆరంభంలో అతని ఫిట్‌నెస్ బాగున్నప్పటికీ, మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన బౌలింగ్ లోడ్ (Bowling Load) ఇంకా తక్కువగా ఉందని భావించి పక్కన పెట్టాం. కానీ ఇప్పుడు అతను పూర్తి స్థాయి కసరత్తులు పూర్తి చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు అతను సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు" అని టామ్ మూడీ పేర్కొన్నారు.
మయంక్ యాదవ్ జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెట్టాలనేది మేనేజ్‌మెంట్‌కు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం లక్నో బౌలింగ్ యూనిట్ పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఒకవేళ మయంక్ తుది జట్టులోకి వస్తే, గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన ఆవేశ్ ఖాన్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఆవేశ్ ఖాన్ ఇప్పటివరకు వేసిన ఓవర్లలో భారీగా పరుగులు (ఎకానమీ 10 పైన) సమర్పించుకోవడం కూడా అతనికి మైనస్‌గా మారింది.
మయంక్ యాదవ్ గతేడాది ఐపీఎల్‌లో 150 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో బంతులు విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. గాయం కారణంగా గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమైన అతను, ఈ ఏడాది ఫిబ్రవరిలో నమీబియాతో జరిగిన ఇండియా-ఎ మ్యాచ్‌లో చివరిసారిగా కనిపించాడు. అద్భుతమైన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే మయంక్, చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో ఆర్‌సిబి బ్యాటర్లకు ఎలాంటి సవాల్ విసురుతాడో చూడాలి.

