ఫైనల్ కు RCB

IPL 2026: ఐపీఎల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించి, సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో గుజరాత్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దెబ్బతో ఆర్సీబీ నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ ఆశలు తలకిందులయ్యాయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. గుజరాత్ బౌలర్లను ఆటాడుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో.. గుజరాత్ ముందు 255 పరుగుల హిమాలయమంత భారీ లక్ష్యం నమోదైంది.
ఇక 255 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిట్లోనే షాక్‌లు తగిలాయి. ఆర్సీబీ బౌలర్ల ధాటికి జీటీ బ్యాటింగ్ లైన్ అప్ పల్టీ కొట్టింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కేవలం 2 పరుగులకే అవుట్ కాగా, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ 29 పరుగులకే పెవిలియన్ చేరాడు. సాయి సుదర్శన్ 14, నిశాంత్ సింధు 5, వాషింగ్టన్ సుందర్ 8 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. వన్‌మ్యాన్ షోలా పోరాడిన రాహుల్ తెవాటియా ఒక్కడే 68 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి పరువు కాపాడాడు. చివరకు గుజరాత్ జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పక్కా ప్లానింగ్‌తో బౌలింగ్ చేస్తూ గుజరాత్ వికెట్లను టకటకా రాల్చేశారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ అద్భుతమైన స్పెల్‌తో 3 వికెట్లు పడగొట్టి గుజరాత్ నడుం విరిచాడు. అతనికి తోడుగా రసిఖ్ సలామ్ 2 వికెట్లు, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లతో చెలరేగారు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు సాధించగా, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బౌలింగ్ అటాక్ ముందు గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
క్వాలిఫయర్-1లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో.. ఈనెల 29న జరిగే క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ తలపడనుంది. మరి ఆ మ్యాచ్‌లో గెలిచి గుజరాత్ మళ్లీ ఫైనల్లో ఆర్సీబీతో రివేంజ్ తీర్చుకుంటుందా? లేక టోర్నీ నుంచి తప్పుకుంటుందా అనేది చూడాలి.

