IPL 2026: రాజస్థాన్‌ను ఓడించి ఐపీఎల్ 2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్!
ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ తుది సమరానికి తెరలేచింది. ముల్లాన్‌పూర్‌లోని పిసిఎ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లి, ఆదివారం జరగబోయే మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104) అద్భుత సెంచరీ, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీల సాయంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఊదేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే గుజరాత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కేవలం ఒక్క పరుగుకే అవుట్ చేసి గట్టి దెబ్బ కొట్టాడు. ఆ వెంటనే రెండో ఓవర్లో కగిసో రబడా.. ధ్రువ్ జురెల్ (7)ను అవుట్ చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా, వైభవ్ సూర్యవంశీ జంటగా కలిసి ఫోర్లు, సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 19 బంతుల్లో 34 పరుగులు చేసిన తర్వాత జడేజా నొప్పితో ఇబ్బంది పడుతూ రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ (11), దాసున్ శనక (3)లను జేసన్ హోల్డర్ అవుట్ చేయగా.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ (7) వెనుదిరిగాడు.
ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుండి కోలుకుని మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా, యువ ఆటగాడు సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. 46 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యవంశీ.. ఆ తర్వాత చెలరేగి ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి మరో 52 పరుగులు జోడించిన తర్వాత సూర్యవంశీ (47 బంతుల్లో 96 పరుగులు) రబడా బౌలింగ్‌లో అవుటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో డోనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 38 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, జడేజా 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ పోటీ పడుతూ బౌండరీల వర్షం కురిపించడంతో గుజరాత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరూ వేగంగా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని, మొదటి 10 ఓవర్లలోనే జట్టు స్కోరును వంద దాటించారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత సాయి సుదర్శన్ దురదృష్టకర రీతిలో హిట్ వికెట్ అయ్యాడు. మొదటి క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీపై కూడా సుదర్శన్ ఇలాగే హిట్ వికెట్ కావడం గమనార్హం.
సుదర్శన్ అవుటైనా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఏమాత్రం తగ్గకుండా రాజస్థాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ కేవలం 53 బంతుల్లోనే 109 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 9 బంతుల్లో 16 పరుగులు చేసి నండ్రే బర్గర్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. చివర్లో జోస్ బట్లర్ (9 నాటౌట్), రాహుల్ తెవాటియా (17 నాటౌట్)లు మిగిలిన పనిని పూర్తి చేసి గుజరాత్ టైటాన్స్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

