IPL 2026: ఐపీఎల్–19 మెగా ఫైనల్‌లో సమవుజ్జీల సమరం కాస్త ఏకపక్షంగా ముగిసింది! లీగ్ దశలో అదరగొట్టిన రెండు జట్ల మధ్య జరిగిన టైటిల్ ఫైట్‌లో... డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి విశ్వరూపం చూపించింది. గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు... స్టార్టింగ్‌లోనే షాక్ ఇచ్చారు బెంగళూరు బౌలర్లు. ప్రమాదకరమైన శుభ్‌మన్‌ గిల్‌ను హాజిల్‌వుడ్ ఔట్ చేయగా... కొద్దిసేపటికే సుదర్శన్‌ను భువనేశ్వర్ పెవిలియన్‌కు పంపాడు. 26 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జీటీని నిశాంత్‌ సింధు, బట్లర్ ఆదుకునే ప్రయత్నం చేశారు.కానీ, బెంగళూరు స్పిన్నర్లు క్రునాల్ పాండ్యా, రసిక్‌ సలామ్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను ఊపిరి తీసుకోనివ్వలేదు. రసిక్ సలామ్ తన అద్భుత బౌలింగ్‌తో 3 వికెట్లు పడగొట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా... వాషింగ్టన్‌ సుందర్‌ ఒంటరి పోరాటం చేశాడు. 37 బాల్స్‌లో 5 ఫోర్లతో 50 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే చేయగలిగింది.

156 రన్స్‌ స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరుకు వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. రబాడ వేసిన ఓ ఓవర్‌లోనే 4, 6, 4, 4తో ఏకంగా 18 రన్స్ రాబట్టాడు. అయ్యర్ 16 బాల్స్‌లోనే 32 రన్స్ చేసి ఔట్ కాగా, దేవదత్ పడిక్కల్ కూడా వెంటనే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పటీదార్, క్రునాల్ పాండ్యాలను రషీద్ ఖాన్ వరుస బంతుల్లో ఔట్ చేసి ఆర్సీబీని కాస్త ఒత్తిడిలోకి నెట్టాడు.కానీ... ఒకవైపు వికెట్లు పడుతున్నా, పిచ్‌పై 'కింగ్' ఉన్నంతవరకు ఆర్సీబీకి తిరుగులేదు! ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ తన క్లాసికల్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. టిమ్ డేవిడ్ 24 రన్స్‌తో కోహ్లీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కేవలం 25 బాల్స్‌లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మ్యాచ్ ముగిసే దశలో ఒక ఆసక్తికరమైన డ్రామా నడిచింది! కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కానీ, థర్డ్ అంపైర్ రీప్లేలో బంతి నేలకు తగిలినట్లు తేలడంతో కింగ్ కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు! ఇక ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తిరిగి చూడలేదు.18వ ఓవర్‌లో ఫోర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేసి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 42 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌’ అవార్డు దక్కగా... వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’‌గా నిలిచాడు. ఈ విజయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు!

PolitEnt Media

PolitEnt Media

Next Story