IPL 2026: సొంతగడ్డపై తడబడ్డ సన్ రైజర్స్.. ఉప్పల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
ఉప్పల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం

IPL 2026: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆదివారం మే 3న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. 7 వికెట్ల తేడాతో ఆరెంజ్ ఆర్మీని మట్టికరిపించింది. ఈ విజయంతో కేకేఆర్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ఆరంభంలో ఓ రేంజ్‌లో ఊపందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. హెడ్ కేవలం 61 పరుగులతో విరుచుకుపడగా, ఇషాన్ కిషన్ 42 పరుగులతో సహకరించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఒకే వికెట్ నష్టానికి 71 రన్స్ చేసిన హైదరాబాద్‌ను చూసి.. స్కోరు 200 దాటుతుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు.కానీ, అక్కడే కోల్‌కతా బౌలర్లు గేర్ మార్చారు. వరుసగా వికెట్లు తీస్తూ సన్‌రైజర్స్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టారు. అభిషేక్ శర్మ 15, క్లాసెన్ 11 పరుగులకే వెనుదిరగడంతో మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. అనికేత్ వర్మ, స్మరణ్, చివరకు కెప్టెన్ కమిన్స్ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లే తర్వాత కేవలం 94 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు సమర్పించుకున్న ఎస్ఆర్హెచ్.. 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో హైదరాబాద్ వెన్ను విరవగా, నరైన్, త్యాగి రెండేసి వికెట్లు పడగొట్టారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు అజింక్య రహానే, ఫిన్ అలెన్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించిన తర్వాత ఫిన్ అలెన్ 29 రన్స్ వద్ద కమిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో యువ సంచలనం అంగ్‌క్రిష్ రఘువంశీ క్రీజులోకి వచ్చాడు. అనుభవజ్ఞుడైన రహానేతో కలిసి రఘువంశీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
రఘువంశీ 59 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించగా, రహానే 43 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో హైదరాబాద్ బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివర్లో రహానే, రఘువంశీ వెనుదిరిగినా.. గ్రీన్, రింకు సింగ్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. కేవలం 18.2 ఓవర్లలోనే కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించి సంబరాలు చేసుకుంది.

