IPL 2026: కోల్ కతాvs పంజాబ్ మ్యాచ్ రద్దు..ఇరు జట్లకు చెరో పాయింట్
ఇరు జట్లకు చెరో పాయింట్

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్,పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన పోరు.. భారీ వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌కు ఆదిలోనే వర్షం అడ్డంకిగా మారింది. ఆట నిలిచిపోయే సమయానికి కోల్‌కతా 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దాదాపు రెండు గంటల పాటు స్టేడియాన్ని ముంచెత్తింది.రాత్రి పదిన్నర గంటలకు వాన తగ్గుముఖం పట్టడంతో.. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ, బౌండరీ లైన్ వద్ద నీరు భారీగా నిలిచిపోవడంతో వేరే దారి లేక రాత్రి 11 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
అయితే, ఆట సాగిన కొద్దిసేపట్లో ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ కేకేఆర్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్ ఫిన్ అలెన్ మరియు కెమెరాన్ గ్రీన్‌లను పెవిలియన్ పంపి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా రూ. 25.20 కోట్ల భారీ ధర పలికిన ఆల్‌రౌండర్ గ్రీన్.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిలవ్వడం కేకేఆర్ క్యాంప్‌లో ఆందోళన కలిగిస్తోంది.కెప్టెన్ అజింక్యా రహానే, యువ బ్యాటర్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ప్రకృతి సహకరించలేదు. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న ఓనర్ షారూఖ్ ఖాన్.. స్టేడియానికి వచ్చినా నిరాశ తప్పలేదు.ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ మూడు పాయింట్లతో ఆర్సీబీని వెనక్కునెట్టి టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది. కేకేఆర్ తన ఖాతాలో మొదటి పాయింట్‌ను వేసుకుంది.

