ప్లేఆఫ్ ఆశలు సజీవం

IPL 2026: ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని అందుకుంది. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో 9 పరుగుల తేడాతో (DLS పద్ధతిలో) గెలుపొందింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత, ఈ సీజన్‌లో సొంత గడ్డపై లక్నోకు ఇది మొదటి విజయం కావడం విశేషం. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించగా, లక్నో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా హిట్టర్ మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 111; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆర్‌సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మార్ష్, స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులతో మెరుపులు మెరిపించడంతో లక్నో భారీ స్కోరు సాధించింది. వర్షం వల్ల లక్ష్యాన్ని 213 పరుగులుగా సవరించారు.
లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ (సున్నా)గా వెనుతిరగడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అయితే, ఈ వికెట్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ వెల్లడించాడు. "గత మ్యాచ్ తర్వాత నేను విరాట్ భయ్యాతో మాట్లాడాను. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు లెంగ్త్‌కు కట్టుబడి ఉండాలని ఆయనే నాకు సలహా ఇచ్చారు. అదే సలహాను పాటించి 140 కి.మీ వేగంతో వేసిన బంతికి ఆయనే క్లీన్ బౌల్డ్ అయ్యారు" అని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. 2023 తర్వాత కోహ్లీ ఐపీఎల్‌లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి.
ఆ తర్వాత రజత్ పాటిదార్ (61), దేవదత్ పడిక్కల్ (34) 95 పరుగుల భాగస్వామ్యంతో ఆర్‌సీబీని గెలిపించేలా కనిపించారు. కానీ, కీలక సమయంలో మళ్ళీ ప్రిన్స్ యాదవ్ (3/33) తన మాయాజాలంతో వీరిద్దరిని అవుట్ చేసి ఆర్‌సీబీని దెబ్బకొట్టాడు. చివర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా పోరాడినా.. చివరి ఓవర్లో దిగ్వేష్ రథి అద్భుతంగా బౌలింగ్ చేసి 20 పరుగులను కాపాడుకోవడంతో లక్నో విజయం ఖాయమైంది. ఈ ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీకి ప్లేఆఫ్ రేసు కష్టతరంగా మారింది.

