భరోసా ఇచ్చిన కృనాల్ పాండ్య

IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించినప్పటికీ, ఆ జట్టు అభిమానుల్లో ఒక చిన్న ఆందోళన మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్‌కు రాకపోవడమే దీనికి కారణం. ముంబై ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాగా, ఆయన స్థానంలో జాకబ్ బెథెల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చారు. కోహ్లీ చీలమండ (Ankle) నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం రావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

అయితే, మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య కోహ్లీ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. కోహ్లీకి పెద్దగా ప్రమాదమేమీ లేదని, ఆయన త్వరలోనే కోలుకుంటారని కృనాల్ భరోసా ఇచ్చారు. "నేను ఇంకా ఫిజియోతో మాట్లాడలేదు కానీ, విరాట్ కోహ్లీ బాగానే ఉంటాడని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు" అని కృనాల్ రిపోర్టర్లతో చెప్పారు. అంతకుముందు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా కోహ్లీ క్షేమంగానే ఉన్నారని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వెల్లడించారు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 15వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో అవుట్ అయిన తర్వాత, కోహ్లీ డగౌట్ వద్ద అసహనంతో తన హెల్మెట్‌ను పక్కకు విసిరేయడం కనిపించింది. కోహ్లీ మెరుపులతో ఆర్సీబీ 240 పరుగుల భారీ స్కోరు చేయగా, ముంబై జట్టు 222 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 179 పరుగులతో జట్టులో రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నారు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story