IPL 2026: ఐపీఎల్ లో రాజస్థాన్ జైత్రయాత్ర..ముంబైపై గ్రాండ్ విక్టరీ
ముంబైపై గ్రాండ్ విక్టరీ

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది! ప్రత్యర్థి ఎవరైనా, పిచ్ ఏదైనా.. రాయల్స్ జోరుకు అడ్డుకట్ట వేయడం ఎవరి తరమూ కావడం లేదు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో రాజస్థాన్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు యశస్వి జైస్వాల్ వెన్నెముకగా నిలిచాడు. కేవలం 32 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జైస్వాల్ బ్యాటింగ్ చూస్తుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయినట్లు అనిపించింది. అతనికి తోడుగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 1 ఫోర్, 5 సిక్సర్లతో 39 పరుగులు చేసి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది.
151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రాయల్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (25), నమన్ ధీర్ (25) కాసేపు మెరుపులు మెరిపించినా.. రాజస్థాన్ బౌలింగ్ ధాటికి ముంబై తలవంచక తప్పలేదు. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, మరియు బర్గర్ తలో రెండు వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచారు. ఫలితంగా ముంబై 11 ఓవర్లలో 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి 27 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 'హాట్రిక్' కొట్టిన రాజస్థాన్ రాయల్స్, ఈ సీజన్‌లో తామే ఫేవరెట్ అని నిరూపించుకుంటోంది.

