IPL 2026: ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి, టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న 15 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టేశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 83 పరుగులు చేసిన రింకూ.. ఐపీఎల్ చరిత్రలో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ధోనీ 40 బంతుల్లో 70 పరుగులు (నాటౌట్) చేశాడు. సుమారు దశాబ్దన్నర కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును రింకూ తన అద్భుత పోరాటంతో అధిగమించాడు. ఈ క్రమంలో సునీల్ నరైన్‌తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్ స్కోరును 150 మార్కు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

ధోనీ పునరాగమనం మరింత ఆలస్యం: ఫ్లెమింగ్ కీలక అప్‌డేట్

మరోవైపు, ఎంఎస్ ధోనీ మైదానంలోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త అందింది. ధోనీ ఫిట్‌నెస్‌పై చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ.. ధోనీ పునరాగమనం మరింత ఆలస్యం కానుందని వెల్లడించారు. వార్మప్ మ్యాచ్‌ సమయంలో ధోనీ పిక్క గాయం (Calf Injury) మళ్లీ తిరగబెట్టడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

సీజన్ ఆరంభం నుండి ఇప్పటికే ఎనిమిది మ్యాచ్‌లకు ధోనీ దూరమయ్యాడు. "నిజానికి ధోనీ ఆడాలని చాలా ఆతృతగా ఉన్నాడు, కానీ పిక్క గాయం చాలా ఇబ్బందికరమైనది. త్వరగా కోలుకుంటాడని భావించాం కానీ, వార్మప్ గేమ్‌లో అది మళ్లీ తీవ్రమైంది. దీంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా పునరావాసం (Rehabilitation) కల్పించాల్సి వస్తోంది" అని ఫ్లెమింగ్ వివరించారు.

ప్రస్తుతం ధోనీ ఫిజియోల పర్యవేక్షణలో కఠినంగా శ్రమిస్తున్నాడని, వికెట్ కీపింగ్ డ్రిల్స్ మరియు త్రోడౌన్స్‌లో పాల్గొంటున్నాడని కోచ్ తెలిపారు. అయితే, మే 1న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్ నాటికి కూడా ధోనీ అందుబాటులోకి రావడం కష్టమేనని ఫ్లెమింగ్ మాటలను బట్టి అర్థమవుతోంది. ధోనీ ఫిట్‌నెస్‌పై ఫైనల్ క్లియరెన్స్ వచ్చే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story