LSG కోచ్ సంచలన వ్యాఖ్యలు.

IPL 2026: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓటమి పాలైన తర్వాత ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఓటమితో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో అడుగున నిలవడమే కాకుండా, ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ మరియు అతను తీసుకుంటున్న నిర్ణయాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు లాంగర్ ఆసక్తికర సమాధానాలిచ్చారు.
ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నిరంతరం చేస్తున్న మార్పులపై చర్చ నడుస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంత్ తన స్థానాన్ని త్యాగం చేస్తూ జోష్ ఇంగ్లిస్‌ను ఓపెనర్‌గా పంపారు. నికోలస్ పూరన్ మూడో స్థానంలో రాగా, పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 15 పరుగులకే వెనుదిరిగారు. దీనిపై లాంగర్ స్పందిస్తూ.. "రెండు రోజుల క్రితం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ 30 లేదా 40 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. అది చూసినప్పుడు పాత పంత్ తిరిగి వచ్చాడని అనిపించింది. టెస్టుల్లో ఐదో స్థానంలో వచ్చి ప్రత్యర్థి జట్లను చిన్నాభిన్నం చేసే సత్తా అతనికి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని వెల్లడించారు.
రిషబ్ పంత్ తన గురించి కాకుండా జట్టు ప్రయోజనాల కోసం స్వార్థం లేకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు వెళ్లారని లాంగర్ ప్రశంసించారు. దీనివల్ల నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63 పరుగులు) స్వేచ్ఛగా ఆడి మెరుపులు మెరిపించగలిగారని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కోవడం సహజమని, పంత్ త్వరలోనే తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలు అందిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
ఇక 27 కోట్ల రూపాయల రికార్డు ధరపై స్పందిస్తూ.. "అతను అత్యంత ఖరీదైన ఆటగాడు కాబట్టి ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకోను. ఆ డబ్బుకు, ఇక్కడి ప్రదర్శనకు సంబంధం లేదు. కేవలం నాయకత్వం అనేది ఒక కష్టమైన బాధ్యత. అతను ఆ ఒత్తిడిని చిరునవ్వుతో ఎదుర్కొంటున్నాడు. పంత్ మళ్లీ తన 'స్పాష్‌బక్లింగ్' (విధ్వంసకర) ఆటతీరుతో అలరించడానికి ఎంతో దూరంలో లేడు" అని లాంగర్ చెప్పుకొచ్చారు.

