IPL 2026: వాంఖడేలో లెజెండ్ సందడి.. ఫుట్‌బాల్ కింగ్ ఛెత్రీకి ఎంఐ జెర్సీ ఇచ్చిన పాండ్యా!
ఫుట్‌బాల్ కింగ్ ఛెత్రీకి ఎంఐ జెర్సీ ఇచ్చిన పాండ్యా!

IPL 2026: క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానులకు కనువిందు చేసే దృశ్యం వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఛెత్రీకి ముంబై ఇండియన్స్ జెర్సీని బహుకరించి సాదరంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పర్యటనలో ఛెత్రీ ముంబై ఆటగాళ్లతో సరదాగా గడిపారు. హార్దిక్ పాండ్యాతో పాటు మహేల జయవర్ధనే, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లతో ముచ్చటించారు. తన సుదీర్ఘ క్రీడా ప్రయాణంలోని అనుభవాలను వారితో పంచుకున్నారు. "నేను స్టేడియానికి రావడం చాలా అరుదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు, వారి అభిమానులకు ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీ అంతటా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అని ఛెత్రీ ఎంఐ టీవీతో పంచుకున్నారు.
మరోవైపు, ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రయాణం ఆశాజనకంగా లేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచినప్పటికీ, నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబైకి నిరాశే ఎదురైంది.
ఆ మ్యాచ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ కేవలం 31 బంతుల్లో 71 పరుగులతో విరుచుకుపడినప్పటికీ, ముంబై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు ముంబై పోరాటాన్ని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక గురువారం వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా గెలిచి, మళ్లీ ఫామ్‌లోకి రావాలని ముంబై ఇండియన్స్ పట్టుదలతో ఉంది.

