IPL 2026: అలా ఆడటం వల్లే ఈ విజయం.. తిలక్ వర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తిలక్ వర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో కదం తొక్కి ముంబయికి భారీ విజయాన్ని అందించాడు. కేవలం 45 బంతుల్లోనే 101పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్.. తన కెరీర్‌లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
22 బంతుల్లో 19 పరుగులు.. ఆ తర్వాత విధ్వంసం
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ ఇన్నింగ్స్ రెండు విభిన్న కోణాల్లో సాగింది. ఆరంభంలో పిచ్ తీరును అర్థం చేసుకునేందుకు తిలక్ చాలా నెమ్మదిగా ఆడాడు. తాను ఎదుర్కొన్న మొదటి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి క్రీజులో కుదురుకున్నాక తిలక్ బ్యాట్ జులిపించాడు. తర్వాతి 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు రాబట్టి సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఒక దశలో 14 ఓవర్లకు 103/4తో కష్టాల్లో ఉన్న ముంబయిని, తన తుపాన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు వద్ద నిలిపాడు.
నైపుణ్యంపై నమ్మకమే గెలిపించింది: తిలక్ వర్మ
మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి తిలక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మొదటి 20 బంతుల్లో క్రీజులో కుదురుకోవడంపైనే దృష్టి పెట్టాను. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏది అవసరమో అది చేశాను. నా దగ్గర రకరకాల షాట్లు ఉన్నప్పటికీ, ఒత్తిడిలో మన సామర్థ్యాలను నమ్మడమే ముఖ్యం. సహజ శైలిలో ఆడటం వల్లే ఈ ఫలితం దక్కింది" అని గర్వంగా చెప్పుకొచ్చాడు.
కుప్పకూలిన గుజరాత్ టైటాన్స్
తిలక్ సెంచరీతో భారీ లక్ష్యాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్, ముంబయి బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 15.5 ఓవర్లలో కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబయి ఇండియన్స్ 99 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

