IPL 2026: సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే..చిన్నారులను ఆటపట్టించిన వైభవ్
చిన్నారులను ఆటపట్టించిన వైభవ్

IPL 2026: ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ! కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ దిగ్గజ బౌలర్లను తన బ్యాటింగ్‌తో వణికిస్తున్న ఈ రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, మైదానం బయట తన అల్లరితో, చిలిపి పనులతో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాడు. తాజాగా వైభవ్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని వస్తున్న వైభవ్‌తో ఫోటో దిగేందుకు ఇద్దరు చిన్నారులు ఆశగా వచ్చారు. వారిని చూడగానే వైభవ్‌లోని అల్లరి నిద్రలేచింది. ఆ పిల్లలతో సరదాగా ఆటపట్టించాలనుకున్న వైభవ్.. "నేను మీతో ఫోటో దిగాలంటే, ఒక్కో ఫోటోకు 100 రూపాయలు ఇవ్వాలి" అంటూ సీరియస్‌గా కండిషన్ పెట్టాడు. నిజంగానే డబ్బులు అడుగుతున్నాడనుకున్న ఆ చిన్నారులు.. అమాయకంగా తమ దగ్గర 200 రూపాయలు ఉన్నాయని సమాధానమిచ్చారు.
పిల్లల అమాయకత్వాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత వైభవ్ కూడా నవ్వుతూ ఆ చిన్నారులను దగ్గరకు తీసుకుని, ఎంతో ముద్దుగా వారితో ఫోటోలు దిగి వారిని సంతోషపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు "పిల్లాడే పిల్లలతో ఆడుకుంటున్నాడు" అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసులో ఇంతటి స్టార్‌డమ్ వచ్చినా, వైభవ్ తనలోని పసితనాన్ని కోల్పోకపోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అటు ఆటతో, ఇటు తన వ్యక్తిత్వంతో అందరి హృదయాలను కొల్లగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక సభ్యుడిగా మారిన ఈ యంగ్ సెన్సేషన్, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఆశాకిరణంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

