IPL 2026: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్... నేరుగా ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది?
నేరుగా ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది?

IPL 2026: క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 క్లైమాక్స్‌కు వచ్చేసింది. అభిమానులను ఉర్రూతలూగించే అసలైన సమరానికి కౌంట్‌డౌన్ షురూ అయింది. ఇవాళ్టి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. ధర్మశాల వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అయితే తొలి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఇరుజట్లు వ్యూహాలు రచిస్తున్నాయి.
ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్ జట్లు అత్యంత నిలకడైన ప్రదర్శన చేశాయి. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు, 18 పాయింట్లతో టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల రికార్డులను చూస్తే.. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో చెరో నాలుగు విజయాలతో ఇరుజట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ సీజన్ లీగ్ దశలో కూడా తమ హోం గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో చెరొకటి గెలుచుకున్నాయి. దీంతో ఈ మహా సంగ్రామంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వేదికవుతున్న ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 211 పరుగులుగా నమోదైంది. రెండుసార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించడంతో.. టాస్ గెలిచిన జట్టు ఇక్కడ కచ్చితంగా ఫీల్డింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇక జట్ల బలాబలాల విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, పడిక్కల్, పటిదార్, టిమ్ డేవిడ్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించనున్నారు. వీరంతా ఫామ్‌లోకి వస్తే ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ చేరడం ఖాయం. మరోవైపు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లపైనే ఎక్కువ ఆధారపడుతోంది. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణలతో జీటీ పేస్ దళం బలంగా ఉండగా.. స్పిన్ ఆల్‌రౌండర్, మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టుకు అదనపు బలంగా మారాడు.
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌లో ఆడిన అనుభవం ఎక్కువ. ఇప్పటివరకు 11 సార్లు ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ 17 మ్యాచ్‌లు ఆడింది. మరోవైపు 2022లో ఎంట్రీ ఇచ్చి, తొలి సీజన్ లోనే కప్ కొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఇప్పటివరకు ఆరు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడి మూడింట్లో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుందా? లేక గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్తుందా? తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

