షెడ్యూల్ మార్పుపై సందిగ్ధత

IPL Broadcasts Banned in Bangladesh: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 2026) ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. తమ జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచులను వేరే చోటికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీ (ICC)ని అధికారికంగా కోరింది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరగాల్సిన తమ గ్రూప్ మ్యాచులను తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టును భారత్‌కు పంపడం క్షేమదాయకం కాదని బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం సోమవారం మీడియాకు వెల్లడించారు. "మేము మా భద్రతా ఆందోళనలను వివరిస్తూ ఐసీసీకి ఈమెయిల్ పంపాము. వారి నుండి వచ్చే స్పందనను బట్టే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

ఐపీఎల్ (IPL 2026) కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు జట్టు నుండి తప్పించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఆడించడంపై భారత్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులను, బోర్డును తీవ్రంగా కలిచివేసింది.

ముస్తాఫిజుర్ పట్ల భారత్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను నిలిపివేయాలని సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. "ఇది మా దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన నిర్ణయం. మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి బోర్డు పూర్తి మద్దతు తెలుపుతోంది" అని అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు.

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తన మూడు మ్యాచులను కోల్‌కతాలో, ఒక మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది. అయితే, తమ ఆటగాళ్లకు భారత్‌లో రక్షణ ఉండదని భావిస్తున్న బంగ్లాదేశ్, ఈ మ్యాచులను సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని పట్టుబడుతోంది. ఫిబ్రవరి 7న వెస్ట్ ఇండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది.

ఈ వివాదంపై ఐసీసీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ మ్యాచులు మార్చాల్సి వస్తే అది టోర్నీ నిర్వహణపై భారీ ప్రభావం చూపుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story