IPL Cricketer Abhishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్, ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని వారాల తర్వాత పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. హూగ్లీలో అదుపులోకి తీసుకున్న అభిషేక్‌ను విచారించి, వైద్య పరీక్షల అనంతరం చించురా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను మూడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేశాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అభిషేక్‌పై చాలా వరకు బెయిలబుల్ కాని సెక్షన్లతో కలిపి మొత్తం 19 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి హూగ్లీ రూరల్ ఎస్పీ కునార్ భూషణ్ సింగ్ మాట్లాడుతూ.. "అభిషేక్‌పై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి ఆయన్ను అరెస్ట్ చేశాం. ఇవాళ కోర్టులో ప్రవేశపెడతాం" అని తెలిపారు.

గత విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు జస్టిస్ సౌగత భట్టాచార్య.. హూగ్లీలోని మగ్రా పోలీస్ స్టేషన్‌ను ఆదేశిస్తూ, అభిషేక్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌తో సహా అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు.

మంగళవారం (ఆగస్టు 11) ఈ కేసు విచారణకు రాగా.. అభిషేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు కోర్టుకు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. "అభిషేక్ బాధితురాలిని అక్రమంగా నిర్బంధించి, ఆమెకు ఆహారం ఇవ్వకుండా కావాలనే ఒంటరిగా ఉంచాడు. దీనివల్ల ఆమె శారీరకంగా బలహీనపడి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకుంది" అని పేర్కొన్నారు. ఏప్రిల్ 2, 2026 న ఢిల్లీలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. అయితే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో ఇంకా రుజువు కావాల్సి ఉంది.

ఫిర్యాదు చేసిన యువతి ఒకప్పుడు అభిషేక్‌తో ప్రేమలో ఉండేదని, వీరి పెళ్లి గురించి ఇరు కుటుంబాల పెద్దలు కూడా మాట్లాడుకున్నారని తెలిసింది. అయితే అభిషేక్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వారి మధ్య గొడవలు జరిగి బ్రేక్-అప్ అయింది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు విచారణలో భాగంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అయితే తనపై వస్తున్న అన్ని ఆరోపణలను క్రికెటర్ అభిషేక్ పోరెల్ ఖండించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story