Lorcan Tucker: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్..
కెప్టెన్ లోర్కాన్ టక్కర్..

Lorcan Tucker: ఐర్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, కొత్త కెప్టెన్ లోర్కాన్ టక్కర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. బెల్ఫాస్ట్‌లో భారత్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించాడు. పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న ఒక దేశానికి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తను ఆడిన మొదటి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 50 కంటే ఎక్కువ పరుగులు (హాఫ్ సెంచరీలు) చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా టక్కర్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా చూస్తే బెర్ముడా దేశానికి చెందిన డెల్రాయ్ రావ్లిన్స్ తర్వాత ఈ రికార్డ్ కొట్టిన రెండో ఆటగాడు ఈయనే.
ఐర్లాండ్ బోర్డు పాల్ స్టిర్లింగ్ స్థానంలో టక్కర్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించిన తర్వాత భారత్‌తో ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. అంతకుముందు 2024, 2026 లలో పాకిస్తాన్, ఒమన్‌లపై తాత్కాలిక కెప్టెన్‌గా చేసినప్పుడు ఆయన వరుసగా 73, 94* పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ టీ20 టీమ్ అయిన ఇండియాపై కేవలం 36 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్.. కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వేసిన బంతులను తట్టుకుంటూ టక్కర్ చాలా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆ తర్వాత సెట్ అయ్యాక శివం దూబే, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అక్షర్ పటేల్ ఓవర్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు.
గారెత్ డెలానీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి, శివం దూబే ఓవర్లో 2 పరుగులు తీసి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 50 పరుగులు చేసిన వెంటనే హర్షిత్ రాణా వేసిన ఒక స్లో షార్ట్ బాల్‌కు పుల్ షాట్ ఆడబోయి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటు ప్రపంచ రికార్డు సృష్టించిన టక్కర్‌పై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ప్రశంసలు కురుస్తున్నాయి.

