Irfan Pathan: నేను, ధోనీ కలిసి తాగుతాం.. హుక్కా వివాదంపై ఇర్ఫాన్ పఠాన్
హుక్కా వివాదంపై ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. ఒకప్పుడు ధోనీ హుక్కా తాగే వారికే జట్టులో అవకాశం ఇచ్చేవారని పరోక్షంగా ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వివాదంపై ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఇర్ఫాన్ పఠాన్ కానీ వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.
సోషల్ మీడియాలో ప్రశ్న, సరదా సమాధానం
ఇటీవల భారత పేసర్ మహ్మద్ షమీ పుట్టినరోజు సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. దానికి స్పందించిన ఒక అభిమాని.. "ఇర్ఫాన్ పఠాన్ భయ్యా.. ఇంతకీ హుక్కా సంగతి ఏమైంది?" అని అడిగాడు. ఈ ప్రశ్నను స్పోర్టివ్‌గా తీసుకున్న ఇర్ఫాన్.. "నేను, ఎంఎస్ ధోనీ కలిసి తాగుతాం" అని సమాధానమిచ్చారు. ఈ సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు ఇర్ఫాన్ ధోనీకి సరైన సమాధానం ఇచ్చారని ప్రశంసించగా, మరికొందరు ఇలాంటి విషయాలను పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఈ చర్చపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్, ఐదేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వీడియోను కావాలని వక్రీకరించారని ఆరోపించారు. "ఎప్పుడో ఐదేళ్ల కిందటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులోని కంటెంట్‌ను వారికి కావాల్సిన విధంగా మార్చేశారు. ఇది అభిమానుల మధ్య యుద్ధమా? లేక పీఆర్ లాబీయింగా..?" అని ఆయన ప్రశ్నించారు. అలాగే, తనకు, ధోనీతో పాటు రాబిన్ ఉతప్ప, సురేశ్ రైనాల మధ్య ఉన్న స్నేహం చాలా బలమైందని.. తాము ఒకరికొకరు లేకుండా భోజనం కూడా చేసేవారు కాదని ఇర్ఫాన్ స్పష్టం చేశారు.
అసలు వివాదం ఏమిటి?
2008లో జరిగిన ఒక మ్యాచ్ తర్వాత తన బౌలింగ్‌పై ధోనీ సంతోషంగా లేడని ఇర్ఫాన్ పఠాన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుక్కా తాగే అలవాటు ఉన్నవారికే ధోనీ తన జట్టులో చోటు ఇస్తాడని పఠాన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "నాకు అలాంటి అలవాటు లేదు. ఎవరో దీని గురించి మాట్లాడుకోవడం విన్నాను. అక్కడ ప్రతిఒక్కరికీ తెలుసు. కొన్నిసార్లు మనం మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమం. ఒక క్రికెటర్ పని ఏంటంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే" అని ఇర్ఫాన్ పఠాన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పాత వీడియో వైరల్ కావడంతో, ఇర్ఫాన్ తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
