Mohammed Shami: టీమ్ ఇండియాలో మహమ్మద్ షమీ శకం ముగిసినట్లేనా?..కివీస్ పర్యటనకు మొండిచేయి వెనుక అసలు కారణమిదే..!
అసలు కారణమిదే..!

Mohammed Shami: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే టీ20 జట్టును వెల్లడించగా, తాజాగా వన్డే, టెస్ట్ జట్లను సైతం ఖరారు చేశారు. అయితే ఈ మూడు ఫార్మాట్లలోనూ భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేరు లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అనేక టెస్ట్ మ్యాచ్‌లలో ఒంటిచేత్తో విజయాలు అందించి, టీమ్ ఇండియా పేస్ దళానికి నాయకత్వం వహించిన షమీని ఇలా వరుసగా పక్కనబెట్టడం చూస్తుంటే, ఆయన అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడినట్లేనని స్పష్టమవుతోంది.
యువతకే సెలెక్టర్ల మొగ్గు
భారత సెలెక్టర్లు ప్రస్తుతం జట్టు భవిష్యత్తుపై దృష్టి సారించారు. వచ్చే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని పేస్ బౌలింగ్ విభాగాన్ని పునర్నిర్మించే పనిలో పడ్డారు. అందుకే షమీ స్థానంలో గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, అన్షుల్ కంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లను న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. ప్రస్తుతం షమీ వయసు 36 ఏళ్లు. ఫాస్ట్ బౌలర్లకు ఈ వయసులో గాయాల నుంచి కోలుకుని, మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడం అంత సులువైన విషయం కాదు. భువనేశ్వర్ కుమార్ ఇటీవల టీ20ల్లోకి పునరాగమనం చేసినప్పటికీ, పొట్టి ఫార్మాట్‌పై షమీకి పెద్దగా పట్టులేకపోవడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది.
దేశవాళీలో నిప్పులు చెరుగుతున్నా దక్కని అవకాశం
మహమ్మద్ షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 74 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత భారత జట్టుకు దూరమైనప్పటికీ, దేశవాళీ క్రికెట్లో మాత్రం వికెట్ల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. రంజీ ట్రోఫీలో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 37 వికెట్లు పడగొట్టి తన పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి రాణించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఏకంగా 7 వికెట్లు సాధించాడు.
ఇలా దేశవాళీ వేదికలపై నిలకడగా రాణిస్తున్నప్పటికీ, సెలెక్టర్లు భవిష్యత్ ప్రణాళికలకే ప్రాధాన్యతనిస్తూ షమీని పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలో ఇకపై షమీని టీమ్ ఇండియాలోకి తీసుకునే అవకాశాలు దాదాపు లేనట్లేనని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా, స్టార్ పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

