Team India Turning Authoritarian: టీమిండియాలో నియంతృత్వం నడుస్తోందా? వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఫైర్..
కోచ్ ఫైర్..

Team India Turning Authoritarian: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల ఈ ప్రతిభావంతుడైన ఆటగాడిని వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితం చేయడంతో అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా టీమిండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ వైఖరిని ఆయన నేరుగా నియంతృత్వంతో పోల్చారు.
"బెంచ్‌పై కూర్చోబెడితే ఆటగాళ్లు ఎలా తయారవుతారు?"
సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ వైభవ్‌ను పక్కన పెట్టడంపై కోచ్ మనీష్ ఓజా ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు అందిస్తూ కనిపించిన వైభవ్‌ను చూసి తాను చలించిపోయానని అన్నారు. "కేవలం బెంచ్‌పై కూర్చోబెట్టడం వల్ల ఏ ఆటగాడూ రాటుదేలడు. అంత అద్భుతమైన ప్రతిభ ఉన్న ప్లేయర్‌ను బయట కూర్చోబెట్టి టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్రమైన తప్పు చేస్తోంది. జట్టు యాజమాన్యం ప్రస్తుతం నియంతలా వ్యవహరిస్తోంది. వారికి తోచినట్లే చేసుకుంటూ పోతున్నారు" అని మనీష్ ఓజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైభవ్ ఓ తుఫాను లాంటివాడని, అతనితో పెట్టుకున్నవారు ఏదో ఒకరోజు దెబ్బతింటారని వ్యాఖ్యానించారు.
అద్భుతమైన రికార్డు ఉన్నా తప్పని నిరాశ
అంతర్జాతీయ టీ20లలో వైభవ్ సూర్యవంశీ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 టీ20 మ్యాచ్‌ల్లో 30.75 సగటుతో 246 పరుగులు సాధించాడు. ఏకంగా 186కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి, ఇప్పటికే రెండు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 భారీ సిక్సర్లు, 22 ఫోర్లు బాదిన ఘనత అతని సొంతం. ఇంతటి మెరుపు స్ట్రైక్ రేట్, ఫామ్ ఉన్నప్పటికీ వెస్టిండీస్ పర్యటనలో అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెస్టిండీస్‌తో మరో రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో కనీసం రాబోయే మ్యాచ్‌లలోనైనా వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

