కెప్టెన్‌గా ఇషాన్ కిషన్!

Ishan Kishan: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్, ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో ఉండటం లేదని సమాచారం. వెన్నునొప్పి గాయం కారణంగా ఆయన ఇంకా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. గతేడాది యాషెస్ సిరీస్ సమయంలోనే ఈ గాయం తిరగబెట్టడంతో, కమిన్స్ ఎప్పుడు జట్టుతో కలుస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో, ఆరెంజ్ ఆర్మీ పగ్గాలను టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.

నిజానికి కెప్టెన్ రేసులో అభిషేక్ శర్మ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనుభవం రీత్యా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది. ఇటీవలే జార్ఖండ్ జట్టును తన కెప్టెన్సీలో తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిపిన ఇషాన్ కిషన్, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆ టోర్నీలో ఏకంగా 197 స్ట్రైక్ రేట్‌తో 517 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, బ్యాటర్‌గా కూడా ఇషాన్ కిషన్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు భారత్ గెలిచిన 2026 టీ20 వరల్డ్ కప్‌లోనూ 207 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోయాడు.

గత సీజన్‌లో సన్‌రైజర్స్ తరపున ఇషాన్ కిషన్ కాస్త అస్థిరంగా ఆడినప్పటికీ, ఈ ఏడాది అతని ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇషాన్ రాణిస్తుండటంతో, ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ - ట్రావిస్ హెడ్ జోడీని కదపాల్సిన అవసరం ఉండదు. కమిన్స్ లేని లోటు బౌలింగ్‌లో కనిపిస్తున్నప్పటికీ, తన నాయకత్వ పటిమతో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. మరి కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story