ISSF World Cup: తెలుగు కుర్రాడు ముకేశ్ ప్రపంచ రికార్డ్
ముకేశ్ ప్రపంచ రికార్డ్

ISSF World Cup: అంతర్జాతీయ షూటింగ్ వేదికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడింది! మన తెలుగు కుర్రాడు నేలవల్లి ముకేశ్ చరిత్ర సృష్టించాడు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ISSF) వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా ప్రపంచ రికార్డునే తిరగరాశాడు.
మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ముకేశ్, పాలక్‌తో కలిసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఫైనల్ పోరులో ఈ జోడీ ఏకంగా 487.7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలవడమే కాకుండా.. జూనియర్ విభాగంలో సరికొత్త వరల్డ్ రికార్డును నమోదు చేసింది.మ్యాచ్ ఆరంభం నుంచే ఈ జోడీ అద్భుతమైన ఏకాగ్రతతో గురి పెట్టింది. పాలక్ 243 పాయింట్లు సాధించగా, ముకేశ్ 244.7 పాయింట్లతో అదరగొట్టాడు. ఈ ధాటికి చైనా షూటర్లు క్వియాన్ జున్ – కాయ్ హో (484.8 పాయింట్లు) రజతానికే పరిమితం కాగా, హంగేరి జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది.
ముకేశ్ ప్రతిభ ఈనాటిది కాదు. ఒలింపియన్ గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీలో రాటుదేలిన ఈ కుర్రాడు, ఇప్పటికే జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా రాణిస్తున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ 581 పాయింట్లతో సత్తా చాటిన ముకేశ్-పాలక్ జోడీ, ఫైనల్లో ఆకాశమే హద్దుగా రాణించి భారత్‌కు స్వర్ణాన్ని అందించారు.

