Yuvraj Singh: టీ20 క్రికెట్‌లో సంచలన ప్రదర్శనలతో అదరగొడుతున్న యువ ఆటగాళ్లను ఇకపై వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలంటూ టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గట్టిగా వాదించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ వంటి ప్రతిభావంతులకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లను కోరారు.

"ఆ ప్రతిభకు న్యాయం చేయాలి": యువీ సంచలన వ్యాఖ్యలు

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. యువ సంచలనాలకు వన్డేల్లో చోటు దక్కకపోవడంపై స్పందించారు. "నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మను వన్డేల్లో చూడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఇషాన్ కిషన్, అభిషేక్, వైభవ్ సూర్యవంశీ లాంటి అసాధారణ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను మనం 50 ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేయకపోతే, వారి టాలెంట్‌కు అన్యాయం చేసినట్లే అవుతుంది. ఈ కుర్రాళ్లు చాలా త్వరలోనే భారత వన్డే జట్టులోకి వస్తారని నేను ఆశిస్తున్నాను" అని యువరాజ్ స్పష్టం చేశారు.

న్యూజిలాండ్‌పై అభిషేక్ సునామీ ఇన్నింగ్స్.. గురువు సరదా ఛాలెంజ్..

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, మొత్తం 38 బంతుల్లో 113 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధ్వంసం చూసిన తర్వాత, మెంటార్ అయిన యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తనలాగే 12 బంతుల్లో అర్ధశతకం సాధించి చూపించాలని అభిషేక్‌కు సరదాగా సవాలు విసిరారు. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. "ఆ సమయంలో యువీ పా ఏ లెవల్ క్రికెట్ ఆడారో నాకు తెలియదు కానీ, 12 బంతుల్లో 50 పరుగులు చేయడం మాత్రం అస్సలు సులువైన పని కాదు" అంటూ నవ్వుతూ బదులిచ్చాడు.

సీనియర్ల పోటీ ఉన్నా.. చోటు దక్కాల్సిందే!

ప్రస్తుతం భారత వన్డే జట్టులో టాప్ ఆర్డర్‌లో అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లు ఉండటంతో కొత్త వారికి చోటు దక్కడం కష్టమేనని యువరాజ్ అంగీకరించారు. అయితే ప్రస్తుత ఫామ్, దూకుడు చూస్తుంటే ఈ యువ బ్యాటర్లను ఎంతో కాలం పక్కన పెట్టలేరని, వారు త్వరలోనే వన్డే జట్టులో కీలక పాత్ర పోషిస్తారని యువీ ధీమా వ్యక్తం చేశారు. వైభవ్ సూర్యవంశీ లాంటి వర్ధమాన ఆటగాళ్లను ఇప్పటి నుంచే సానబెడితే భవిష్యత్తుకు తిరుగుండదని అభిప్రాయపడ్డారు.

Next Story