Jemimah Rodrigues’ Key Comments: కన్నీళ్లపై జెమీమా రోడ్రిగ్స్ కీలక కామెంట్స్
జెమీమా రోడ్రిగ్స్ కీలక కామెంట్స్

Jemimah Rodrigues’ Key Comments: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, మ్యాచ్ మధ్యలో తన అనుభవించిన తీవ్ర ఒత్తిడి, భావోద్వేగాన్ని తాజాగా వెల్లడించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, జెమీమా (127 నాటౌట్) అజేయ శతకం సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చింది. మ్యాచ్ అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభంలో నేను తీవ్రమైన ఆందోళనతో బాధపడ్డాను. నా మనసు సరిగ్గా లేదు. నేను దాదాపు ప్రతిరోజూ ఏడ్చేదాన్ని అని జెమీమా భావోద్వేగంతో వెల్లడించింది. చాలా సార్లు నా అమ్మకు ఫోన్ చేసి, ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆందోళనగా ఉన్నప్పుడు ఏమీ తోచదు, అంతా మొద్దుబారినట్లు అనిపిస్తుందని తెలిపింది. తన అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, "నేను ఒంటరిగా ఈ ఇన్నింగ్స్ ఆడలేకపోదును. నేను యేసు క్రీస్తుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనే నన్ను ముందుకు నడిపించాడని పేర్కొంది. చివర్లో నేను చాలా అలసిపోయాను, నా శక్తి పూర్తిగా హరించుకుపోయింది. ఆ సమయంలో నా మనసులో నేను ఇది చేయలేను అనిపించింది. అప్పుడు నేను పదే పదే బైబిల్ వాక్యాన్ని పునరావృతం చేసుకున్నాను. జెమీమా రోడ్రిగ్స్ ఈ ఇన్నింగ్స్‌ను తన కోసం కాకుండా, గతంలో కీలక మ్యాచ్‌లలో ఓడిన టీమ్ ఇండియా గెలవడం కోసమే ఆడానని స్పష్టం చేసింది. తన సహచర క్రీడాకారిణులు దీప్తి శర్మ, స్మృతి మంధాన వంటి వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా ఆమె గుర్తుచేసుకుంది.

