Kangana Ranaut: కంగనా రనౌత్ 12 జ్యోతిర్లింగాల యాత్ర సంపూర్ణం
12 జ్యోతిర్లింగాల యాత్ర సంపూర్ణం

Kangana Ranaut: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తన దశాబ్ద కాల ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే తన సంకల్పాన్ని భీమశంకర జ్యోతిర్లింగ దర్శనంతో ఆమె సంపూర్ణం చేశారు. నటి కంగనా రనౌత్ గత పదేళ్లుగా సాగిస్తున్న తన జ్యోతిర్లింగ యాత్రను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని తన చివరి మజిలీగా ఆమె పేర్కొన్నారు. ఇది తన పూర్వీకుల పుణ్యఫలం, మహాదేవుడి ఆశీస్సుల వల్లే సాధ్యమైందని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ యాత్రలో భాగంగా శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
భీమశంకర్ ఆలయ విశిష్టత గురించి తెలుపుతూ, శివుడు, శక్తి ఇద్దరూ 'అర్ధనారీశ్వర' రూపంలో ఒకే లింగంలో కొలువై ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇదేనని కంగనా పేర్కొన్నారు. "ఈ పురాతన లింగం రోజంతా వెండి కవచంతో కప్పబడి ఉంటుంది. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆ కవచం లేకుండా దర్శనమిస్తుంది. ఆ పవిత్ర సమయంలోనే నేను దర్శించుకోగలిగాను" అని ఆమె తన అనుభవాన్ని వివరించారు.
మొదట్లో ఈ దర్శనాలు యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ, ఇటీవల తాను స్పష్టమైన నిర్ణయం తీసుకుని డిసెంబర్ నాటికి మొత్తం 12 దర్శనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంగనా తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె జార్ఖండ్‌లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం (9వ దర్శనం), మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం వంటి క్షేత్రాలను సందర్శించారు. మహారాష్ట్ర తన ఇంటి లాంటిదని, ఇక్కడ బాబా ఘృష్ణేశ్వర్ ఆశీస్సులు లభించడం తన అదృష్టమని ఆమె గతంలో పేర్కొన్నారు.

