Mr. Olympia: మిస్టర్ ఒలింపియాలో కరుణ్ణపన్ వెంకటేషన్‌కు కాంస్యం
కరుణ్ణపన్ వెంకటేషన్‌కు కాంస్యం

Mr. Olympia:హైదరాబాద్‌కు చెందిన బాడీబిల్డర్ కరుణ్ణపన్ వెంకటేషన్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత్ కీర్తిని చాటారు. లాస్ వెగాస్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక డ్రగ్-ఫ్రీ మిస్టర్ ఒలింపియా బాడీబిల్డింగ్ పోటీల్లో ఆయన కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ నేచురల్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ (INBA) ఆధ్వర్యంలో లాస్ వెగాస్‌లో జరిగిన మిస్టర్ ఒలింపియా పోటీలలో, 16 దేశాల క్రీడాకారులు పాల్గొనగా, 49 ఏళ్ల వెంకటేషన్ కాంస్య పతకం సాధించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన ఏకైక భారతీయ బాడీబిల్డర్ ఈయనే కావడం విశేషం. ఈ పోటీని డ్రగ్-ఫ్రీ ప్రమాణాలతో నిర్వహించారు, దీనికి సంబంధించి ప్రతి క్రీడాకారుడికి కఠినమైన యాంటీ-డోపింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మిస్టర్ ఒలింపియాలో కాంస్యం సాధించడం వెంకటేషన్‌కు ఇటీవల కాలంలో లభించిన రెండవ అంతర్జాతీయ విజయం. లాస్ ఏంజిల్స్‌లో అంతకుముందు జరిగిన 'నాచురల్ మిస్టర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్'లో ఆయన క్లాసిక్ బాడీబిల్డింగ్ కేటగిరీలో బంగారు పతకం (Gold) సాధించి, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచారు. కేవలం రెండు పోటీల మధ్య తక్కువ వ్యవధి ఉండటం, జెట్ లాగ్, శాకాహారిగా (Vegan) ఉండటం వల్ల అక్కడ ఆహారం దొరకడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించినట్లు వెంకటేషన్ తెలిపారు. వెంకటేషన్ గెలుపు తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

